తొలుత పలుకుతో జనాన్ని మురిపించి, ఆపై అభినయంతోనూ ఆకట్టుకున్న ఘనుడు గొల్లపూడి మారుతీరావు... ఆయన రాసిన మాట పలు చిత్రాలకు బంగారుబాట వేసింది... ఆయన వేసిన వేషాలు అనేక చిత్రాల విజయంలో పాలుపంచుకున్నాయి... నటరచయితగా రాణించిన గొల్లపూడి మారుతీరావు పుట్టినరోజు నేడు... ఈ సందర్భంగా ఆయనకు విషెస్ చెబుతూ మారుతీరావు మాటను, గొల్లపూడి నటనను గుర్తు చేసుకుందాం...
పుట్టడమే సాహిత్యసువాసనలు విరజిమ్మే కుటుంబంలో కావడంతో- బాల్యంలోనే మారుతీరావు రచనావ్యాసంగంలో అడుగువేశారు... పాతికేళ్ళు నిండకముందే అన్నపూర్ణ సంస్థ నిర్మించిన 'డాక్టర్ చక్రవర్తి'కి స్క్రీన్ ప్లే రాసి భళా అనిపించారు... ఆ పైన 'గొల్లపూడి' మాటకు చిత్రసీమలో ఓ బాట ఏర్పడింది... ఆ బాటలో పయనించిన పలు చిత్రాలు విజయతీరాలను చేరుకున్నాయి... గొల్లపూడి పలుకు కొన్ని చిత్రాలకు 'ఉలుకు'గా మారింది, కొన్నిసార్లు జనాన్ని 'కులికే'లా చేసింది... మాటలతో మంత్రం వేస్తున్న గొల్లపూడిలోని నటుణ్ణి ఏ ముహూర్తాన పసికట్టాడో కానీ, కోడి రామకృష్ణ తన తొలి చిత్రం 'ఇంట్లో రామయ్య-వీధిలో క్రిష్ణయ్య'లోనే మారుతీరావుకు నటుడిగా ఓ మార్కు వచ్చేలా చేశాడు...
రచయితగా పత్రికల్లోనూ, సినిమాల్లోనూ పలు ప్రయోగాలు చేసిన మారుతీరావు సంపాదించుకోలేని గుర్తింపును నటుడిగా 'గొల్లపూడి' అనతికాలంలోనే కొల్లగొట్టేశారు... చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, మోహన్ బాబు వంటి టాప్ స్టార్స్ చిత్రాల్లో గొల్లపూడి అభినయం వెలుగులు విరజిమ్మింది... ప్రస్తుతం మారుతీరావుకు అంతగా అవకాశాలు లేకున్నా, ప్రశాంత జీవనం సాగిస్తున్నారు... తన తనయుడు శ్రీనివాస్ పేరిట నెలకొల్పిన అవార్డును ప్రతియేటా ప్రతిభావంతులకు ప్రదానం చేస్తున్నారు... గొల్లపూడి మరిన్ని వసంతాలు చూస్తూ ఆనందంగా సాగిపోవాలని ఆశిద్దాం...