రఘుపతి రాఘవ రాజారాం .. పతిత పావన సీతారాం !
ఈశ్వర అల్లా తేరో నాం .. సబుకో సన్మతి దే భగవాన్ !!
ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ
ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ (2)
కరెన్సీ నోటు మీదా .. ఇలా నడి రోడ్డు మీద
మనం చూస్తున్న బొమ్మ కాదుర గాంధీ
భరతమాత తలరాతను మార్చిన విధాతరా గాంధీ
తరతరాల యమ యాతన తీర్చిన వరదాతర గాంధీ
ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ
ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ
రామనామమే తలపంతా .. ప్రేమధామమే మనసంతా
ఆశ్రమ దీక్షా స్వతంత్ర్య కాంక్షా .. ఆకృతి దాల్చిన అవధూతా
అపురూపం ఆ చరితా !
కర్మయోగమే జన్మంతా .. ధర్మక్షేత్రమే బ్రతుకంతా
సంభవామి అని ప్రకటించిన అలనాటి కృష్ణ భగవద్గీతా
ఈ బోసినోటి తాతా !!
మనలాగే ఓ తల్లి కన్న మామూలు మనిషి కదరా గాంధీ
మహాత్ముడంటూ మన్నన పొందే స్థాయికి పెంచద ఆయన స్పూర్తీ
సత్యాహింసల మార్గజ్యోతీ !
నవశకానికే నాందీ !!
రఘుపతి రాఘవ రాజారాం .. పతీత పావన సీతారాం !
ఈశ్వర అల్లా తేరో నాం .. సబుకో సన్మతి దే భగవాన్ !! (2)
గుప్పెడు ఉప్పును పోగేసీ .. నిప్పుల ఉప్పెనగా చేసీ
దండి యాత్రనే దండయాత్రగా ముందుకు నడిపిన అధినేతా
సిసలైన జగజ్జేతా !
చరఖాయంత్రం చూపించీ .. స్వదేశి సూత్రం నేర్పించీ
నూలుపోగుతో మదపుటేనుగుల బంధించాడుర జాతిపితా
సంకల్పబలం చేతా !!
సూర్యుడస్తమించని రాజ్యానికి .. పడమర దారిని చూపిన క్రాంతీ
తూరుపు తెల్లారని నడిరార్తికి స్వేచ్చాభానుడి ప్రభాత కాంతీ
పదవులు కోరని పావన మూర్తీ !
హృదయాలేలిన చక్రవర్తీ !!
ఇలాంటి నరుడొక ఇలా తలంపై నడయాడిన నాటి సంగతీ
నమ్మరానిదని నమ్మకముందే ముందు తరాలకు చెప్పండీ
" సర్వజన హితం నా మతం
అంటరానితనాన్ని, అంతఃకలహాలని అంతం చేసేందుకే నా ఆయువంతా అంకితం
హే .. రామ్ ! "
చిత్రం : మహాత్మ (2009)
సంగీతం : విజయ్ ఆంథోనీ
రచన : సిరివెన్నెల
గానం : ఎస్.పి.బాలు