Sakshi | Updated: February 02, 2014 00:59 (IST)
మహానటులు ఎమ్జీయార్, కరుణానిధిల ప్రగాఢ స్నేహం గురించి, దరిమిలా ఏర్పడిన రాజకీయ వైషమ్యం గురించి మణిరత్నం ‘ఇరువర్’ (ఇద్దరు) తీశారు. తెలుగునాట అలాంటి జంట ఒకదాన్ని తీసుకుని రసవత్తరమైన కథగా, సినిమాగా మలచాలంటే ఏయన్నార్ - ఎన్టీయార్‌ల పేర్లే తడతాయి. తమిళ జంట వంటి కథ కాదిది. దీనిలో స్నేహం ఉంది, స్పర్థ ఉంది, పోటాపోటీ గ్రూపులు నడిపే సామర్థ్యం ఉంది, మళ్లీ ఇద్దరూ కలిసి కొత్త తరాన్ని అదుపు చేసే ప్రయత్నమూ ఉంది, వేడి చల్లారాక చేతులు కలిపి మళ్లీ నటించడమూ ఉంది. కొన్ని విషయాల్లో పోలిక ఉంది, మరికొన్ని విషయాల్లో వైరుధ్యమూ ఉంది.
వినడానికి ఇప్పుడు అతిశయోక్తిగా అనిపిస్తుందేమో కానీ, ఒకప్పుడు ఏఎన్నార్, ఎన్టీయార్ పోలికలున్న రికార్డింగ్ డ్యాన్సు ఆర్టిస్టులు బజార్లోకి వచ్చినా జనం గుమిగూడి ఆరాధనగా చూసేవారు. పెళ్లిచూపుల్లో సైతం అవతలివారు ‘నాగ్గాడి’ ఫ్యానో, ‘ఎమ్టీవోడి’ ఫ్యానో తేల్చుకున్నాకే సంభాషణ ముందుకు సాగేది.
ఏయన్నార్, ఎన్టీయార్ తెలుగు సినిమా రంగపు తొలి దశలోనే హీరోలయ్యారు. 1950ల నుండి 80ల వరకు మూడు దశాబ్దాలు ఏలారు. 1940-49 మధ్య ఏడాదికి సరాసరి 8 సినిమాలు వస్తే, 1950లో 16 వచ్చాయి. 1950-59 మధ్య ఏడాదికి సగటున 23 వచ్చాయి. ఆ దశకంలోనే స్వాతంత్య్రానంతర భారతదేశం రెక్కలు విప్పుకోసాగింది. విద్యుత్ సౌకర్యం గ్రామాలకు విస్తరించి, థియేటర్లు రాసాగాయి. 1980 వచ్చేసరికి ఏడాదికి 118 సినిమాలు వచ్చాయి. అంటే వారానికి రెండు కంటే ఎక్కువ సినిమాలన్నమాట. ఏయన్నార్, ఎన్టీయార్ కెరియర్లు ఈ బూమ్ పీరియడ్‌తో పెనవేసుకున్నాయి. వాళ్లకు ముందున్న హీరోలు నారాయణరావు, నాగయ్య, రాఘురామయ్య వంటివారు. వాళ్లకున్న స్టార్ స్టేటస్‌ను మించి వీళ్లకు వచ్చింది.
1950ల తర్వాత పౌరాణిక, జానపద సినిమాలు తగ్గి సాంఘిక సినిమాలు రాసాగాయి. ప్రజలు తమ సమస్యలను వాటిలో చూసుకుని హీరోలతో మమేకమవసాగారు. వీళ్లల్లో ఏ ఒక్కరి ప్రస్తావన వచ్చినా, ఇంకోరితో పోలిక ఆటోమ్యాటిక్‌గా వచ్చేసేది. ‘‘రహస్యం’లో ఎన్టీయార్ వేసి ఉంటే హిట్టయ్యేది’... వంటివి నటన గురించైతే, ‘నాగేశ్వరరావు లౌక్యుడు, ఎన్టీయార్‌లా బోళా మనిషి కాడు’ అనే వ్యాఖ్యలు స్వభావం గురించి!
నాగేశ్వరరావు అంటే చటుక్కున గుర్తుకువచ్చేది భగ్న ప్రేమికుడు. ప్రేమించిన అమ్మాయి కోసం త్యాగం చేసి ఆమె జీవితంలోంచి తొలగిపోయే మంచివాడు. అందుకే ఆయన ఆ ఇమేజీలో మిడిల్ క్లాస్ ప్రేక్షకుల హృదయంలో నిలిచిపోయాడు. ముఖ్యంగా స్త్రీలు ఈ పాత్రను ఆరాధించి, ఈ అపర దేవదాసును వాళ్ల మనసులో ప్రతిష్టాపించుకున్నారు.
ఎన్టీ రామారావు కూడా విషాద నాయక పాత్రలు వేసినా నాగేశ్వరరావంత కన్విన్సింగ్‌గా వేయలేదు. ఉత్తరాదిన దిలీప్‌కుమార్, దక్షిణాదిన నాగేశ్వరరావు. మన మజ్నూ ఆయనే. సలీమూ ఆయనే. దాంతో ఆ ముద్ర ఎంత గాఢంగా పడిపోయిందంటే ఎన్టీయార్‌లో ఉన్న నట వైవిధ్యం ఏయన్నార్‌లో లేదని అనాలోచితంగా అనేసేటంతగా! కానీ ఆలోచిస్తే తొలి జానపదాల్లో అక్కినేనే హీరో! బాలరాజు, కీలుగుఱ్ఱం, మాయలమారి, స్వప్నసుందరి, సువర్ణసుందరి, స్త్రీ సాహసం, రత్నమాల, ముగ్గురు మరాఠీలు... సాంఘికాల్లో బాగా పాతుకున్నాక కూడా రహస్యం, వసంతసేనలలో వేశారు. చరిత్రాత్మక పాత్రల గురించి చెప్పుకుంటే, పల్నాటి యుద్ధం, అమర శిల్పి జక్కన, చాణక్య చంద్రగుప్త, రామదాసు... పౌరాణిక పాత్రలంటే - చెంచులక్ష్మి, మాయాబజారు, కృష్ణార్జున యుద్ధం. నవలా నాయకుడూ ఆయనే - చక్ర భ్రమణం, సెక్రటరీ, విజేత, ప్రేమనగర్... శరత్ పాత్రలు అత్యధికంగా ధరించిన తెలుగు నటుడూ ఆయనే - దేవదాసు, తోడికోడళ్లు, బాటసారి! భక్తుడి పాత్రల్లో అయితే నాగేశ్వరరావు తర్వాతే ఎవరైనా. విప్రనారాయణ, భక్త తుకారాం, కుంభార్, బుద్ధిమంతుడు... ఇలా.
త్యాగమూర్తి పాత్రల్లో అక్కినేనికి పేరు వచ్చినా కామెడీ అదరగొట్టేశాడు. మిస్సమ్మ, పెళ్లిసందడి, బుద్ధిమంతుడు, చక్రపాణి, పెళ్లినాటి ప్రమాణాలు, గుండమ్మకథ, ప్రేమించి చూడు, గృహలక్ష్మి, బ్రహ్మచారి, అందాలరాముడు... ఇలా అనేకం గుర్తుకువస్తాయి. కొంటెతనం, చిలిపితనం ఆయనలో భలే పలుకుతుంది.
నాగేశ్వరరావు గురించి ఏం తెలిసినా తెలియకపోయినా ఓ విషయం మాత్రం అందరికీ తెలుసు. ఆయన డబ్బున్నవాడు కాడు, చదువుకున్నవాడు కాడు, పల్లెటూరివాడు. అలాంటివాడు ఇంత పైకి ఎలా వచ్చాడు? ఎవరైనా పైకి రావాలంటే తనను తాను సమీక్షించుకోవాలి. నాగేశ్వరరావు ఆ పనిని నిరంతరం చేసుకున్నారు. కెరియర్ పట్ల ప్లానింగ్, పాత్ర పోషణలో సంయమనం ఆయనలో అడుగడుగునా కనబడతాయి. సీనియర్ల వద్ద నేర్చుకుంటూనే, తనకు ప్రత్యర్థిగా ఎదిగిన ఎన్టీయార్‌తో ఎలా తలపడాలి, తలపడి ఎలా నిలదొక్కుకోవాలి అన్నది బాగా అధ్యయనం చేసి, అమలు చేశారు.
సినీరంగ ప్రవేశం చేసే నాటికి ఎన్టీయార్‌కు 26 యేళ్లు. ఏయన్నార్ కంటే ఏడాదిన్నర పెద్దయినా (1944 సీతారామ జననం నుండి లెక్కవేస్తే) ఐదేళ్లు వెనుకగా సినీరంగంలో ప్రవేశించారు. అప్పటికే ఎస్టాబ్లిష్ అయిన నాగేశ్వరరావుని ఉలిక్కిపడేలా చేసిన రామారావు అర్హతలేమిటి? మంచి రూపం, మంచి శరీర సౌష్టవం, మంచి వాచికం, మంచి చదువు... అన్నీ మంచిలే! ఎన్నో లోపాలు అధిగమిస్తూ నాగేశ్వరరావు తన ప్రస్థానం సాగించారు. రామారావుకి ఆ బాధలు లేవు. హీ వాజ్ ఏ బోర్న్ హీరో! వస్తూవస్తూనే ఆయన హీరో అయిపోయారు. ఎన్టీయార్‌ని కలవడానికి వస్తూండగా దూరం నుండి చూసి బీఏ సుబ్బారావు, ‘‘ఇతను నా సినిమా హీరో అయితే ఎంత బాగుణ్ను’’ అనుకున్నారు. ఈయన దగ్గరకు వచ్చిన ఎన్టీయార్, ‘నేను ఫలానా’ అనగానే ‘అయితే నువ్వే నా హీరోవి’ అన్నారు. మేకప్ టెస్ట్ లేదు, వాయిస్ టెస్ట్ లేదు, వెయ్యి నూట పదహార్లు అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసేసుకున్నారు.
పాత్రలో జీవించడం అనే పదబంధం ఎన్టీయార్ విషయంలో అతికినట్టుగా మరెవరి విషయంలోనూ నప్పదు. ఏయన్నార్ ఎప్పుడూ అంటారు - ‘మనం పాత్రలో పూర్తిగా లీనం కాకూడదు. లీనమైనట్టు - నటించాలంతే! లేకపోతే తూకం తప్పుతాం. మనం వేరేగా ఉండి మన పాత్ర గమనాన్ని గమనించాలి’ అని. కానీ ఎన్టీయార్ పద్ధతి అది కాదు. ‘పల్లెటూరి పిల్ల’లో కోడెదూడతో పోట్లాడే దృశ్యంలో ఒడుపు తెలియక కుడిచేతి మణికట్టు విరగకొట్టుకున్నారు. ఈ లక్షణమే ఏయన్నార్‌ను, ఎన్టీయార్‌ను విడదీసి చూపుతుంది. ఎన్టీయార్ పౌరాణిక పాత్రల్లో చూపిన సంయమనం మామూలప్పుడు చూపలేదు. హీ వాజ్ ఆల్వేస్ ప్లేయింగ్ టూ ది గ్యాలరీ. ఇలాంటి వాళ్లని స్వాష్‌బక్లింగ్ హీరోస్ అంటారు. హీరోయిన్‌ను గాఢంగా హత్తుకోవడం, కత్తిని ముద్దు పెట్టుకోవడం, మారువేషం వేస్తూ వేస్తూ మధ్యలో మీసం పీకి ‘నేనేరా’ అన్నట్టు ప్రేక్షకులకేసి చూసి కన్నుకొట్టడం, విలన్‌ను చావగొట్టి చెవులు మూసి హాల్లో ఈలలు వేయించడం - ఇవన్నీ ఇలాంటి హీరోల లక్షణాలు. ఇవి చూస్తూ ప్రేక్షకుడు మైమరచిపోతాడు. వీటిలో హీరో మొరటుగా ఉంటాడు. హావభావాలు ప్రస్ఫుటంగా వ్యక్తం చేస్తాడు. చదువురానివాడికి కూడా అర్థమయ్యే రీతిలో హిస్ట్రియానిక్స్ ప్రదర్శిస్తాడు. అందువల్ల మధ్యతరగతివాళ్లు ముఖ్యంగా మధ్యతరగతి మహిళలు ఇలాంటి హీరోను ఆమోదించరు. నేల తరగతి వనితలు మాత్రం ఆరాధిస్తారు. ఎందుకంటే ఇతను ఎప్పుడూ మంచివాడిగానే ఉంటాడు. మోటు సరసాలాడతాడు. త్యాగాలు చేసి పారిపోకుండా కోరినదాన్ని పోరాడి దక్కించుకుంటాడు. తమిళంలో ఎమ్జీయార్ ఇటువంటి పాత్రలే వేశారు. ఆయనను గొప్ప నటుడిగా విమర్శకులు అంగీకరించకపోవచ్చు. కానీ పాటకజనం అతన్ని నెత్తిమీద పెట్టుకున్నారు.
‘బాలరాజు’తో స్టార్‌డమ్ వచ్చి కీలుగుర్రం, రక్ష రేఖ, శ్రీలక్ష్మమ్మ కథ, స్వప్నసుందరిలతో స్థిరపడినా, జానపదాలనే నమ్ముకోకుండా సాంఘికాల్లో కూడా వేస్తేనే భవిష్యత్తు ఉంటుందని నాగేశ్వరరావు ముందుగానే గ్రహించారు. అదీ ఆయన ఘనత. అప్పటికే ఎన్టీయార్ రంగప్రవేశం చేశారు. ఆయన విగ్రహం, వాచికం చూడబోతే అలాంటి పాత్రలకు సరిగ్గా సూటవుతాడనిపిస్తోంది. తను దేనికి బాగా సూటవుతాడా అని ఆలోచిస్తే సాంఘికాల దారి పట్టడమే మంచిదనిపించి ఉంటుంది. సాంఘికాలకు పనికిరాడు అన్న టాక్ వచ్చినా ఆ పాత్రలకు తగ్గట్టుగా మేకప్, దుస్తులు వేయించుకుని స్టిల్స్ తీయించుకుని నిర్మాతలకు చూపారు. సగం పారితోషికానికే ‘సంసారం’లో వేశారు. ఆ సినిమా హిట్ అయింది. ‘దేవదాసు’ తర్వాత సాంఘికాలంటే ఏయన్నారే తగును అనే పేరు వచ్చేసింది. రామారావును పౌరాణికాలు, జానపదాల్లో బాగా గుర్తుపెట్టుకున్నా ఆయన వేసిన వాటిల్లో సాంఘికాలే ఎక్కువ. వాటిలో పెళ్లిచేసి చూడు, మిస్సమ్మ, వద్దంటే డబ్బు, తిక్క శంకరయ్య వంటి కామెడీలు, చిరంజీవులు, ఇంటికి దీపం ఇల్లాలే, రక్తసంబంధం, ఆత్మబంధువు వంటి ట్రాజెడీలు ఉన్నాయి.
ఎన్టీయార్‌ని తెలుగువారు ఎప్పటికీ మర్చిపోలేనట్టు చేసినవి పౌరాణికాలే! ఆయన పౌరాణిక పాత్రల నిర్వహణ గురించి ‘న భూతో... ఇప్పట్లో న భవిష్యతి’ అని చెప్పగలం. నాగేశ్వరరావు వేసిన పాత్రలు ఆ తరువాత శోభన్‌బాబు వేశారు, తర్వాత నాగార్జున వేశారు, జగపతిబాబు వేశారు. ఏదో ఒక స్థాయిలో, ఎంతో కొంత దూరంలో ఆయన స్థానానికి చేరువగా వచ్చారు. కానీ ఎన్టీయార్ పౌరాణిక పాత్రల దగ్గరికి వచ్చేసరికి ఆయనలా ఒప్పించినవారు అరుదు. అరుదు అని ఎందుకనాలంటే కాంతారావూ కృష్ణుడు వేషం వేశారు, హరనాథూ వేశారు. బాగానే చేశారు. ‘సంపూర్ణ రామాయణం’లో శోభన్‌బాబూ వేసి నప్పించారు. రావణుడిగా, దుర్యోధనుడిగా, కీచకుడిగా ఎస్వీ రంగారావు గొప్పగా రాణించారు. అయితే ఎన్టీ రామారావు ఒక్కరే అన్ని రకాల పౌరాణిక పాత్రల్లోనూ నప్పారు. అది తెలిసిన ఏయన్నార్ పౌరాణికాల్లో భారీ పర్సనాలిటీ అవసరం లేని, గుక్క తిప్పుకోకుండా డైలాగులు చెప్పనక్కరలేని పాత్రలే ఎంచుకున్నారు. దుర్యోధనుడు లాంటివి వేసి హైరాన పడలేదు, పెట్టలేదు.
‘మాయాబజారు’లో అభిమన్యుడిది ఆహార్యం మార్పు తప్ప సాంఘిక సినిమాల్లో రొమాంటిక్ టైపు రోలే! కొంటెగా మాట్లాడే ‘భూకైలాస్’లో నారదుడి పాత్ర, రసికత్వమే ప్రధానంగా - చెంచులక్ష్మి, కృష్ణ మాయ, శ్రీకృష్ణార్జున యుద్ధం... ఇలాంటివే వేశారు. రామారావు ఎన్ని పాత్రలు వేసినా అన్నీ రాజసం ఉన్నవే. నాగేశ్వరరావు బ్రాహ్మణ పాత్రలు, కవి పాత్రలు వేసి చక్కగా ఒప్పించారు. రామారావు వేయలేదు, వేసినా నప్పేది కాదేమో! ‘శ్రీనాథుడు’ బ్రాహ్మణుడే కానీ రాజసం జాస్తి. కవి పాత్రలన్నీ ఏయన్నార్ వేసినవే - జయదేవ, కాళిదాసు, క్షేత్రయ్య, తెనాలి రామకృష్ణ.
ఏయన్నార్, ఎన్టీయార్ తమకు నప్పిన పాత్రలను ఎలా ఎంచుకునేవారో ఒక్క ఉదాహరణ. ‘తెనాలి రామకృష్ణ’లో వారిద్దరూ పాత్రలు తారుమారు చేసుకుని ఉంటే సినిమా ఆడి ఉండేది కాదు. ఈ ఎరిక ఏయన్నార్‌కు బాగా ఉంది. ‘చాణక్య-చంద్రగుప్త’ తీస్తూ ఎన్టీయార్ ‘బ్రదర్! నువ్వు చంద్రగుప్తుడు, నేను చాణుక్యుడు వేద్దామా?’ అని అడిగితే నాగేశ్వరరావు - చాలా కాలిక్యులేటెడ్ కదా - ‘వద్దులే, ఇలాగే కానీ’ అన్నారట. వినోదా వారి ‘కన్యాశుల్కం’లో గిరీశం పాత్ర ఇస్తే నాగేశ్వరరావు వద్దనేశారు విలనిక్ షేడ్ ఉందని. ఎన్టీయార్ వేసేశారు. అలాగే ‘చింతామణి’లో వేశ్యకు విటుడిగా బిల్వమంగళుడి పాత్ర. ఏయన్నార్ వద్దన్నారు, ఎన్టీయార్ సరేనన్నారు. ఆయనకు అన్ని రకాల పాత్రలు వేయాలన్న తపన ఎక్కువ. ‘రాజు పేద’లో తాగుబోతు పాత్ర, ‘భీష్మ’లో ముసలి పాత్ర, ‘కలిసి వుంటే కలదు సుఖం’లో అవిటివాడి పాత్ర, ‘నర్తనశాల’లో ఆడంగి పాత్ర... నాగేశ్వరరావుకు పాత్రల ఎంపికపై కచ్చితమైన లెక్కలున్నాయి. 1971లో ‘దసరాబుల్లోడు’ రిలీజైంది. నాగేశ్వరరావు హఠాత్తుగా కుర్రవేషాలేస్తూ స్టెప్పులు మొదలెట్టారు. అది ఆయన జీవితంలో టర్నింగ్ పాయింట్.
ఎన్టీయార్ విషయంలో ఈ పీరియడ్ నటుడిగా ఆయన స్థాయి తగ్గించింది. 1972 నాటికి ఆయన ‘బడిపంతులు’లో అద్భుతంగా నటించారు. 49 యేళ్లకే శరీరం భారీగా పెరిగిపోయింది. నాగేశ్వరరావులా ఆయన శరీరాన్ని అదుపులో పెట్టుకోలేదు. అప్పుడు కనుక ఆయన రిటైరై ఎప్పుడో అప్పుడొకటీ ఇప్పుడొకటీ వేస్తూ ఉంటే హుందాగా ఉండి ఉండేది. కానీ అప్పుడాయన విన్నింగ్ స్ట్రీక్‌లో ఉన్నాడు. జంజీర్, దీవార్, యాదోంకీ బారాత్ వంటి అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర హిందీ సినిమాల తెలుగు వెర్షన్లలో వేయడం మొదలెట్టాడు. వల్గారిటీ చేరింది. స్టెప్స్ వేయడం మొదలైంది. నాగేశ్వరరావు వేస్తే భరించగలిగాం కానీ ఈయన వేస్తే బాబోయ్ అనిపించింది. పెద్ద పొట్ట, దాన్ని దాచుకోవడానికి కోటు, కింద బెల్‌బాటమ్ పాంట్. ఈ ధోరణిలో సాగుతూండగానే అడవిరాముడు సూపర్ డూపర్ హిట్. అక్కణ్నుంచి యమగోల, వేటగాడు, డ్రైవర్ రాముడు, ఆటగాడు, సూపర్‌మ్యాన్ - చిత్రం ఏమిటంటే, ఇవన్నీ హిట్ అయ్యాయి. అప్పట్లో ఈయన తీసిన పౌరాణికాలన్నీ పరాజయం పాలయ్యాయి. రామారావు యువతరానికి చేరువైంది ఈ సినిమాల ద్వారానే. వాళ్లే ఆయనకు రాజకీయాల్లో ఓట్ బ్యాంక్ అయ్యారు. చివరికి వచ్చేసరికి బొబ్బిలిపులి, కొండవీటి సింహం - ఇవన్నీ అప్పటి మూడ్‌లో హిట్ కావచ్చు కానీ నటుడిగా ఆయన స్థాయిని దిగజార్చాయని వ్యాసకర్త వ్యక్తిగత అభిప్రాయం.
ఎన్టీయార్ దక్షిణాదిన అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటుడిగా ఉన్నత స్థానంలో ఉండగానే తప్పుకుని తన ఆధిక్యతను చాటుకున్నారు. ఏయన్నార్ నటజీవితం చాలా ఏళ్లు సాగింది. అయితే మూసపాత్రలు రాకుండా చూసుకున్నారు. అదీ కెరియర్ ప్లానింగంటే! గ్లామర్ తగ్గాక ఆయన అత్యున్నతమైన నటన కనబరిచినది సీతారామయ్యగారి మనవరాలు (1992)లో. 50 ఏళ్లలో, 231 సినిమాల ద్వారా నేర్చుకున్నది ‘అన్‌లెర్న్’ చేసుకుని ఫ్రెష్‌గా వేశారాయన.
ఎన్టీయార్‌లాగే ఏయన్నార్ కూడా నిర్మాతగా మారారు, స్టూడియో కట్టారు. కానీ దర్శకుడిగా మారలేదు. ఎన్టీయార్‌కి ముందు నుండీ అభ్యుదయ భావాలున్నాయి. సాంఘిక ప్రయోజనం ఉన్న సినిమాలు తీయాలి అనుకుని, సినిమా రంగానికి వచ్చిన 3, 4 యేళ్లలోనే ‘పిచ్చిపుల్లయ్య’, ‘తోడు దొంగలు (దానిలో 60 ఏళ్ల పాత్ర) వంటి మంచి సినిమాలు తీశారు. అదే నాగేశ్వరరావైతే నిర్మాతగా తొలి చిత్రం జానపద సినిమా! రంగానికి వచ్చిన పాతికేళ్లకు ‘సుడిగుండాలు’, ‘మరోప్రపంచం’ తీశారు. ఎన్టీయార్ తీసిన తొలి రెండు సినిమాలు దెబ్బతిన్నాయి. చాలా నిరాశకు లోనై, కత్తి పడితే తప్ప తన సంస్థ నిలదొక్కుకోదని గ్రహించాడు. ‘జయసింహ’తో ఎన్‌ఏటీ సంస్థ నిలబడి అనేక మంచి సినిమాలు తీసింది కానీ అన్నీ కమర్షియల్సే! ఆర్ట్ సినిమాల జోలికి పోలేదు.
ఎన్టీయార్, ఏయన్నార్ ఇరువురి వారసులూ సినీరంగంలో వెలుగుతున్నారు. ఎన్టీయార్ రాజకీయాల్లోకి వెళ్లి అక్కడ సంచలనం సృష్టించారు. ఏయన్నార్ సినీరంగాన్ని వదలలేదు. మద్రాసు నుండి హైదరాబాద్‌కు చిత్రపరిశ్రమను తరలించడంలో హీరోయిజం ప్రదర్శించినది నాగేశ్వరరావే. ఆ విషయంలో ఈయన క్యాంపుకు, ఎన్టీయార్ మద్రాసు క్యాంపుకు ఎలాంటి గొడవలుండేవో, మధ్యలో ఆర్టిస్టులు ఎలా నలిగేవారో గుమ్మడి ఆత్మకథ చదివితే తెలుస్తుంది. వ్యక్తిగతంగా ఈ ఇద్దరు నటులు బహిరంగంగా దూషించుకున్నది లేదు. కుటుంబాల పరంగా సత్సంబంధాలు పాటించారు.
తెలుగుజాతికి సంబంధించినంతవరకూ వీరిద్దరూ మ్యాటినీ ఐడాల్స్ మాత్రమే కాదు, సోషల్స్ ఐకాన్స్ కూడా! చాలామంది నాటక కళాకారులు రంగస్థలంపైకి తాగి వచ్చి ప్రదర్శన రసాభాస చేసేవారు. జీవిత చరమాంకంలో డబ్బు లేక అల్లాడేవారు. వేదికపై వాళ్ల నటనను మెచ్చేవారు కూడా విడిగా వారితో కలవడానికి ఇచ్చగించేవారు కారు. సినిమా రంగం నాటక రంగానికి కొనసాగింపు కాబట్టి సినిమావాళ్లు కూడా ఇలాగే ఉంటారని జనం అనుకునేవారు. అందుకే దగ్గరి బంధువులు కూడా సినిమా నటులకు పిల్లనిచ్చేవారు కారు. క్రమేపీ ఈ ఇమేజీ మారడానికి కారణం ఏయన్నార్, ఎన్టీయార్‌లే. వాళ్లు తమ వ్యక్తిగత జీవితాలపై మచ్చ రాకుండా చూసుకోగలిగారు. ఎన్టీయార్ సినిమా రంగానికి వచ్చేటప్పటికే వివాహితుడు. వచ్చాక కూడా భార్యను విడిచి పెట్టలేదు. సాధారణ గృహస్తులాగే పిల్లల్ని కనడం, వాళ్లకు విద్యాబుద్ధులు చెప్పించడం, పెళ్లిళ్లు పేరంటాలు చేయించడం అవీ జరిపారు. ఏయన్నార్‌కు సినిమాలకు వచ్చాకనే పెళ్లయింది. సినిమాల్లో గ్లామర్ బాయ్‌గా ఉన్నా, ఇంటి దగ్గర మామూలు ఇంటాయనలాగానే ఉన్నారు. పిల్లల చదువుల గురించి హైదరాబాద్‌కి తరలి రావడం, తెలిసిన కుటుంబాల నుంచి అల్లుళ్లను తెచ్చుకోవడం, మీ ఇంటి పక్క పెద్దమనిషి ఎలా చేస్తాడో అలాగే చేశారు. భార్య పేర స్టూడియో కట్టారు. ఆవిడ చివరి ఐదేళ్లూ మంచాన పడితే జాగ్రత్తగా చూసుకున్నారు.
ఏఎన్నార్, ఎన్టీయార్ ఇద్దరూ సాంస్కృతిక సభలకు, కాలేజీలకు, బంధువుల ఇళ్లల్లో ఫంక్షన్లకు వచ్చినప్పుడు మామూలు తెలుగు పెద్దమనిషి తరహాలో పంచెకట్టుతోనే వచ్చారు. రంగు రంగు డ్రెస్సులన్నీ ఉద్యోగ ధర్మంగా వేసుకున్నవే తప్ప విడిగా మేము హుందాగా ఉండేవాళ్లమేనని చాటిచెప్పారు. వారికి భాషపై గల పట్టు కూడా ప్రత్యేకించి ప్రస్తావించాలి. వారి తెలుగు ఉచ్ఛారణ శుద్ధంగా ఉండటం వలన, చక్కటి పదసంపద ఉండటం వలన వారు మనల్ని ప్రభావితం చేయగలిగారు. మన పాలిట వీళ్లు గ్లామరస్ టీచర్స్. ప్రేక్షకులకే కాదు. తర్వాత సినీరంగానికి వచ్చిన నటీనటులకు కూడా.
- ఎమ్బీయస్ ప్రసాద్
ఏయన్నార్, ఎన్టీయార్ తమకు నప్పిన పాత్రలను ఎలా ఎంచుకునేవారో ఒక్క
ఉదాహరణ. ‘చాణక్య-చంద్రగుప్త’ తీస్తూ ఎన్టీయార్ ‘బ్రదర్! నువ్వు చంద్రగుప్తుడు, నేను చాణుక్యుడు వేద్దామా?’ అని అడిగితే నాగేశ్వరరావు - చాలా కాలిక్యులేటెడ్ కదా - ‘వద్దులే, ఇలాగే కానీ’ అన్నారట.
ఎన్టీయార్ దక్షిణాదిన అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటుడిగా ఉన్నత స్థానంలో ఉండగానే తప్పుకున్నారు. ఏయన్నార్ నటజీవితం చాలా ఏళ్లు సాగింది.
తెలుగుజాతికి సంబంధించినంతవరకూ వీరిద్దరూ మ్యాటినీ ఐడాల్స్ మాత్రమే కాదు, సోషల్స్ ఐకాన్స్ కూడా!ఫంక్షన్లకు వచ్చినప్పుడు మామూలు తెలుగు పెద్దమనిషి తరహాలో పంచెకట్టుతోనే వచ్చారు. రంగు రంగు డ్రెస్సులన్నీ ఉద్యోగ ధర్మంగావేసుకున్నవే తప్ప విడిగా మేము హుందాగా ఉండేవాళ్లమేనని చాటిచెప్పారు.