వరంగల్ జిల్లా రాయపర్తిలో 1927లో జన్మించిన టి.కృష్ణ అసలు పేరు టి.కృష్ణమాచారి. వారి తండ్రి మంచి పండితులు. ఉభయ భాషా ప్రావీణ్యులు. భగవద్గీతకు వ్యాఖ్యానం చెప్పడంలో ఆ కాలంలోనే ఆయన్ని మించిన వారు లేరు. తనలాగే తన కొడుకును కూడా ఉభయ భాషా ప్రవీణుణ్ణి చేయాలని ప్రయత్నించారు. కానీ, ఏ సమయంలో సినిమాలను అభిమానించడం మొదలు పెట్టాడోగానీ టి.కృష్ణ తన భవిష్యత్తును సినిమా రంగంలోనే వెదుక్కోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లే, ఆ రంగంలో తనదైన ముద్ర వేసుకోగలిగారు.
చిన్ననాటి నుంచే తనకు నటన పట్ల, నాటకాల పట్ల మంచి అభిరుచి ఉంది. దానికితోడు మేనమామ నాటి మంత్రి టి.హయక్షిగీవాచారి ప్రోత్సాహమూ తోడవడంతో నటుడిగా వారు జీవితం ప్రారంభించారు.అయితే, టి.కృష్ణకు దైవదత్తంగా లభించిన కంఠస్వరం అదనపు ఆకర్షణైంది. ఆయన తాతగారు వీథి భాగవతాలు చెప్పేవారు. అలా తాతగారి సంగీత కళను తనలోకి ఆవహింప చేసుకోవడమూ కలిసి వచ్చింది. అలా అని, తాను నాటకాలంటూ తిరిగి చదువును అశ్రద్ధ చేయలేదు. మెట్రిక్ పూర్తి కాగానే ఉస్మానియాలో చేరి 1948లో బిఎ పూర్తి చేశారు. ఇంకా పై చదువులు చదవమని ఇంట్లో పెద్దవాళ్లు చెప్పారుగానీ, సినిమాల్లో పనిచేయడానికి ఈ మాత్రం చదువు చాలనుకున్నారాయన. యూనివర్సిటీ విద్యవైపు చూడకుండా మద్రాస్‌కు వెళ్లాలని కృష్ణ నిర్ణయించుకున్నారు.
అయితే, మద్రాస్‌కు వెళ్లకముందే ఆయన అభిరుచి వన్నె తేలింది. చిన్నప్పటినుంచీ బడిలో పాటల పోటీల్లో పాల్గొనేవారు. కాలేజీ చదివే రోజుల్లో నాటకాల్లో వేషాలు వేశారు. అక్కడి నాటకాల పోటీలో హీరోగానో, హీరోయిన్‌గానో వేషాలు వేసి బహుమతులు పొందిన అనుభవం తనది. అందుకే, చదువు ఆపేశాక ఇంట్లో ఉద్యోగం చేయాలన్న వొత్తిడికి తలొగ్గారు. అందులోనూ మళ్లీ తన అభిరుచికి తగ్గట్టుగానే, ‘గోలకొండ’ పత్రికలో సినిమా సమీక్షలు రాయడం, హైదరాబాదు రేడియోలో గ్రామస్థుల కార్యక్షికమంలో పాల్గొనడం, ‘లింగడు’ పాత్రలో ప్రసంగాలు చేయడం-ఇట్లా సినిమా చుట్టే తన అభిరుచిని పరివ్యాప్తం చేసుకున్నాడే తప్పా వేరే దిక్కు పోలేదు.
అంతకు ముందే మరో సంగతి కూడా జరిగింది. హైదరాబాదు రాష్ర్టంలో రజాకార్ల దురంతాల సమయంలో ఓ ఏడాది తన చదువు వెనుకబడింది. అప్పట్లో తాను కాంగ్రెస్ పార్టీలో చేరి క్రియాశీలక కార్యకర్తగా పనిచేశారు. ఈ సమయంలోనే రామచంవూదరావుతో పరిచయం ఏర్పడింది. ఆయన అప్పటికే గూడవల్లి రామవూబహ్మం వద్ద ‘ఇల్లాలు’ తదితర చిత్రాలకు సహాయ దర్శకుడిగా జెమినీ స్టూడియోలో పని చేసి ఉన్నారు. ఆయన టి.కృష్ణలోని ఉత్సాహాన్ని , ఆయనకున్న అర్హతలను గమనించి, ‘నీలాంటి విద్యార్థి సినిమాలకు చాలా అవసరం. ప్రయత్నిస్తే పరిక్షిశమలో మంచి స్థితికి చేరుకుంటావు’ అని వెన్ను తట్టారు. ఈ మాటలు కృష్ణను మరింత ప్రభావితం చేశాయి. వీటన్నిటి కారణంగా ఇట్లా చిన్న చిన్న ఉద్యోగాలతో అభిరుచిని సంతృప్తి పర్చుకోవడానికి బదులు ఏకంగా మద్రాస్ రైలెక్కడమే మంచిదని నిర్ణయించుకున్నారు. 1950లో చ్నై చేరుకున్నారు కృష్ణ.
వెళ్లనైతే వెళ్లారుగానీ అక్కడెవరూ తెలియదు. అయినా ఢీలా పడలేదు. మొండి ధైర్యంతో వెళ్లి భరణి రామకృష్ణను కలుసుకొని తన గురించి చెప్పుకున్నారు. అంతా విన్న ఆయన హెచ్.ఎం.డ్డిని కలుసుకుంటే తప్పకుండా ఏదో ఒక మార్గం చూపుతారని చెప్పి పంపించారు. అదృష్టవశాత్తూ హెచ్.ఎం.డ్డి సమయం ఇవ్వడం, తన నాటక అనుభవాన్ని వినడం, రేడియో ‘లింగడు’ పాత్రను ఏకబిగిన ప్రదర్శిస్తే చూసి మెచ్చుకోవడం జరిగాయి. ‘సరే, ఇక్కడే ఉండు. పని నేర్చుకో’ అని చెప్పి ఆ వెంటనే కృష్ణను డైరెక్షన్ శాఖలో చేర్చుకున్నారు. హెచ్.ఎం.డ్డి అప్పట్లో ‘నిర్దోషి’ సినిమా తీస్తున్నారు. ఆ సినిమాకు టి.కృష్ణను సహాయ దర్శకుడిగా పెట్టుకున్నారు.
దర్శకత్వ శాఖలోనైతే చేరారుగానీ, మన కృష్ణకు లోలోన ఒక అసంతృప్తి ఉంది. తనకు డైరెక్షన్ మీదకన్నా సినిమాల్లో వేషం వేయడం అన్నా, పాటలు పాడటం అన్నా ఇష్టం. కానీ, మనసులోని మాట పెద్దాయనకు చెబితే ఎక్కడ మొదటికే మోసం వస్తుందో అని భయపడి తన పని తాను చేసుకుంటూ మరో వంక బయటి చిత్రాల్లో అవకాశాలకోసం ప్రయత్నించసాగారు. ఇంతలో సి.ఆర్.సుబ్బరామన్ వద్ద కోరస్ పాటల్లో మొదట గొంతు కలిపే అవకాశం వచ్చింది. తర్వాత కె.ఎస్. ప్రకాశ్‌రావు ‘మొదటిరాత్రి’లో ఓ వేషమూ వేశారు. కానీ, సమస్య కాని ఓ సమస్య వచ్చి పడింది. ఆయన మాట్లాడుతుంటే సహజ సిద్ధమైన తెలంగాణ యాస ప్రస్ఫుటంగా ధ్వనించేది. అదే తనకి సమస్య అయింది. సినిమా రంగంలో కృష్ణ, గోదావరి, గుంటూరు జిల్లాల భాషదే ఆధిపత్యం. దాంతో మంచి కంఠస్వరంతోపాటు నటనానుభవం, అభిరుచి, శ్రద్ధా ఉండికూడా టి.కృష్ణ నిస్సహాయంగా ఉండిపోయారు. కోస్తాంధ్ర ఆధిపత్య భావజాలం తనకు సినిమాల్లో నటించి పాడటాన్ని అవహేళన చేసినట్లయింది. చివరకు నటనను మానుకొని డైరెక్షన్ వైపు స్థిరపడిపోవాలని నిర్ణయించుకున్నారు టి.కృష్ణ.
ఇంతలో వరంగల్ ప్రాంతానికి చెందిన దేశ్‌ముఖ్‌లు శుభోదయ పతాకంపై హెచ్.వి.బాబు దర్శకత్వంలో ‘ఆదర్శం’ (1952) సినిమా తీశారు. దీనికి కృష్ణ సహకార దర్శకుడుగానే గాక ఒక ముఖ్య కామేడీపాత్రను పోషించారు. అదీ మహానటి సావిత్రి పక్కన. ఈ చిత్రానికి ఎడిటర్ ఎం.వి.రాజన్. ఆయన ఎడిటింగ్‌కి వెళుతున్నప్పుడల్లా మన కృష్ణతో ‘సినిమా డైరెక్టర్‌కు ఎడిటింగ్ తెలియడం చాలా అవసరం’ అని చెప్పేవారు. ‘నీకు ఉత్సాహం ఉంటే ఎడిటింగ్‌లో చేరి పని నేర్చుకో’ అని కూడా సలహా ఇచ్చేవారు. దాంతో కృష్ణ ఎడిటింగ్ శాఖలో చేరడం, ఆ పని తనకు బాగా నచ్చడం... ఇంకేం... ఇక తాను రాజన్ దగ్గరే చాలాకాలం పనిచేశారు. అటు తర్వాత ‘ఆలీబాబా నలబై దొంగలు’, రాజ్‌కపూర్ ‘ఆహ్’ చిత్రానికి అనువాదమైన ‘ప్రేమలేఖలు’ (దీని తమిళ వెర్శన్ ‘అవన్’) చిత్రాలకు కూడా రాజన్ వద్ద అసిస్టెంటుగా పనిచేశారు టి .కృష్ణ. అంతేకాదు, ‘ప్రేమలేఖలు’లో ప్రాణ్ పాత్రకు తెలుగులో డబ్బింగ్ కూడా చెప్పారాయన.
జీవిక సాగడానికి సినిమాల్లో అన్ని పనులు చేసుకుపోతున్న కృష్ణకి ఒకనాడు పాండి బజారులో భావనారాయణ గారు కనిపించి ‘నేను , డీబి నారాయణ కలిసి ఒక సినిమా తీస్తున్నాం. నువు అసిస్టెంటుగా పనిచేస్తావా? ’ అని అడిగారు. పనికోసం పదిసార్లు, పది చోట్లకు తిరిగి అలసిపోతున్న సందర్భంలో ఈ మాటలు ఆయనకు అమృత గుళికల్లా వినిపించాయి. ఆ సినిమా పేరు ‘అమర సందేశం’ (1954). ఆ కొత్త దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు. అంతకు ముందు 1953లోనే కె.ఎస్‌పకాశరావు ‘కన్న తల్లి’ తీస్తున్న రోజుల్లోనే ఆదుర్తితో టి.కృష్ణకు పరిచయం ఉంది. ఆదుర్తి కూడా తాను దర్శకుడవ్వగానే ఎవ్వరైనా ఎడిటింగ్ తెలిసిన వారినే అసిస్టెంటుగా పెట్టుకుంటే బాగుంటుందనుకున్నాడు. అనుకున్నట్లుగా, ఆడబోయిన తీర్థం ఎదురైనట్లుగా భావనారాయణ టి.కృష్ణను ఎంపిక చేయడంతో వారిద్దరి కాంబినేషన్ అలా మొదలైంది. ఆ చిత్రానికి ఎడిటింగ్ , డైరెక్షన్ శాఖల్లో అసిస్టెంటుగా పనిచేశారు కృష్ణ. ఆ వెంటనే కాకపోయినా రెండేళ్ల తర్వాత ఆదుర్తికి అన్నపూర్ణ సంస్థ దుక్కిపాటి మధుసూదన రావు నుంచి పిలుపు వచ్చింది. అలా ‘తోడి కోడళ్లు’ (1957)కు దర్శకుడైనారు. ఆదుర్తి వెంటనే టి.కృష్ణకు ఎడిటింగ్ శాఖలో ‘అసిస్టెంటు ఎడిటర్’గా ఉద్యోగం ఇచ్చారు. అది మొదలు ఆదుర్తి చివరి చిత్రం దాకా ఆయన చిత్రాలకు దర్శకత్వ, ఎడిటింగ్ శాఖల్లో ఆయన పనిచేశారు.
ఆదుర్తిగారే టి.కృష్ణను 1961లో తన ‘కృష్ణవూపేమ’ చిత్రానికి ‘స్వతంత్ర ఎడిటర్’ను చేశారు. అప్పటి నుంచి ఆదుర్తి తీసిన ‘మంచి మనుషులు’, ‘మూగ మనసులు’, ‘చదువుకున్న అమ్మాయిలు’, ‘డాక్టర్ చక్రవర్తి’, ‘సుమంగళి’, ‘దాగుడు మూతలు’, ‘తోడు నీడ’, ‘వెలుగు నీడలు’, ‘పూల రంగడు’, ‘తేనే మనసులు’, ‘కన్నె మనసులు’, ‘సుడిగుండాలు’ తదితర సుమారు 30 చిత్రాలకు ఎడిటర్‌గా పని చేశారు.
ఒక్క తెలుగులోనే కాకుండా హిందీలో తీసిన ‘మిలన్’, ‘డోలీ’, ‘మస్తానా’, ‘మన్‌కామీత్’, ‘దర్పణ్’, ‘జీత్’ చిత్రాలకు కూడా టి.కృష్ణ ఎడిటర్‌గా చేశారు. ఇంకా సింహళ తమిళ భాషల్లోకి అనువాదమైన చిత్రాలను కూడా ఎడిట్ చేశారు. తెలంగాణ వాడు కనుక ఉర్దూ భాషలో ప్రావీణ్యం ఉన్నవాడు కనుక హిందీ చిత్రాలకు కూడా పనిచేయగలిగారని అప్పట్లో ‘విజయచిత్ర’ మాస పత్రికలో రాశారు. ఇంకా గొప్ప సంగతేందంటే బి.ఆర్. చోప్రా సినిమాలను కూడా ఆయన ఎడిట్ చేశారు.
అన్నపూర్ణ, బాబు మూవీస్, విజయభట్ తదితర సంస్థలకు పర్మినెంట్ ఎడిటర్‌గా ఉన్న టి.కృష్ణ 1967లో దర్శకునిగా మారారు. విజయవర్ధన్ మూవీసు వారు ‘బొమ్మై అన్న తమిళ చిత్రాన్ని కొని, ఆదుర్తి చేత తీయించాలనుకున్నారు.
అయితే, అప్పట్లో ఆయన ఇతర సినిమాలతో బిజీగా ఉండటంతో డైరెక్షన్ తెలిసిన టి.కృష్ణకు ఆ పని అప్పజెప్పారు. అలా కృష్ణ దర్శకత్వంలో తొలిసారిగా ‘ఉపాయంలో అపాయం’ చిత్రం తయారైంది. విశేషమేమంటే కేవలం 21 రోజుల్లో పూర్తిచేసి ఫస్ట్ కాపీని సిద్ధం చేశారాయన. ఈ సినిమా 120 రోజులు ఆడింది. దీని తర్వాత మళ్లీ ఎడిటర్‌గా కొనసాగుతున్న కృష్ణ బొంబాయిలో ఉన్నప్పుడు ‘ఏక్ ముట్టి ఆస్మాన్’ అనే ఉర్దూ నవలను చదివి దాన్ని సినిమా తీయాలని రచయిత వీరేంద్ర సిన్హాను సంప్రదించారు. అయితే ఆ కథనం అప్పటికే ప్రేమ్‌జీకి ఇవ్వడం జరిగింది. అది ‘దుష్మన్’ పేరుతో తీయబోతున్నారని, అది పూర్తవ్వగానే తెలుగు హక్కులు ఇస్తాననడంతో కృష్ణ అందుకోసం ఆగిపోయారు.
కథ బాగా నచ్చడంతో ఏడాదిపాటు ఎదురు చూసేందుకు సిద్ధపడ్డారు . ఇందుకు మరో కారణం కూడా ఉంది. అతని వరంగల్ మిత్రులు మార్కండేయ, ఆంజనేయులు, హైదరాబాదు మిత్రులు, లక్ష్మణ్‌రావు, బాబుల్ నాథ్‌లు కృష్ణతో మంచి సినిమా తీయాలని ఎదురు చూస్తున్నారు. కథ దొరకగానే బాలాజీ చిత్రం పేరుతో సంస్థను ప్రారంభించి, శోభన్‌బాబు హీరోగా ‘ఖైదీ బాబాయి’ చిత్రం తీశారు. ఇది 1974లో విడుదలై విజయం సాధించింది. ఆ తర్వాత వరుసగా ‘మొనగాడు’ (1976), ‘మంచి బాబాయి’ (1978), ‘లక్ష్మీ నిలయం’ (1982), ‘అందరికంటే మొనగాడు’ (1985), ‘బలిపీ భారతనారి’ (1989), చివరి చిత్రం ‘అమ్మో పోలీసోళ్లు’ (1999)తో సహా ఆయన మొత్తం పదకొండు చిత్రాలకు దర్శకత్వం వహించారు.
1980లో మద్రాసు నుంచి హైదరాబాదుకు మకాం మార్చిన కృష్ణ ఆ తర్వాత ‘మల్లె మొగ్గలు’, ‘విక్రం’ వంటి సినిమాలకు ఎడిటర్‌గా పనిచేశారు. ఆయన జీవిత కాలంలో 300కు పైగా చిత్రాలను ఎడిట్ చేశారు. హైదరాబాదు వచ్చాక కొన్ని టి.వి. సీరియళ్లకు కూడా కథలు అందించిన కృష్ణ అటు తర్వాత సినిమా పరిక్షిశమలో మారిన ట్రెండును స్వీకరించలేక తనకు తాను పరిధులు విధించుకున్నారు.
తెలుగు చిత్ర సీమలో ఒక అర్ధ శతాబ్దం పాటు నటుడిగా, గాయకుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, ఎడిటర్‌గా, దర్శకుడిగా ఒక వెలుగు వెలిగిన మన టి.కృష్ణ 2001 మే 9న హైదరాబాదులో కన్ను మూశారు.
ఆదుర్తి సుబ్బారావు అనుచరుడిగా ఎడిటింగ్ శాఖలో నిష్ణాతుడుగా తెలుగు సినీ చరివూతలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న టి.కృష్ణ మన ఓరుగల్లు బిడ్డ... తెలంగాణ వెండి వెలుగు...!
టి.కృష్ణ దర్శకత్వంలో తొలిసారిగా ‘ఉపాయంలో అపాయం’ చిత్రం తయారైంది. విశేషమేమంటే కేవలం 21 రోజుల్లో పూర్తి చేసి ఫస్ట్ కాపీని సిద్ధం చేశారాయన. ఈ సినిమా 120 రోజులు ఆడింది.