తెలుగు సినిమా చరిత్రలో ఉత్తమ కుటుంబ కథా చిత్రాల ప్రస్తావన వచ్చినప్పుడల్లా తప్పకుండా గుర్తుకు వచ్చే దర్శకుడు మన లక్ష్మీదీపక్. జూన్ 10న ఆయన 11వ వర్థంతి.
1935లో హైదరాబాద్‌లో పుట్టిన లక్ష్మీదీపక్ అసలు పేరు లక్ష్మీనారాయణ. హైస్కూలులో చదువుకునే రోజుల్లోనే సినిమాలు తీయాలని, దర్శకత్వం వహించాలన్న కోరిక పెంచుకున్నాడు. అయితే, సినిమాలు తీయడానికి, డైరెక్ట్ చేయడానికి ఏం చేయాలో మాత్రం అతనికి తెలియదు. కానీ, విపరీతంగా సినిమాలు చూడటమేగాక, నాటకాల వారితో కలిసి తిరిగేవాడు, వాటిల్లో వేషాలు కూడా వేసేవాడు.
హైదరాబాదీ కావడంతో ఆయన చదువంతా ఉర్దూ మీడియంలోనే సాగింది. దీంతో హిందీ సినిమాల్లోనే తన అదృష్టం పరీక్షించుకోవాలనుకున్నాడు. అప్పట్లో హిందీలో అగ్రక్షిశేణి సంగీత దర్శకులైన శంకర్ - జై కిషన్ ద్వయంలో హైదరాబాదీ అయిన శంకర్‌ను బాగా ఎరిగిన ఒకాయన సిఫారసు ఉత్తరం ఇచ్చాడు. దాంతో బొంబాయి రైలెక్కాడు మన లక్ష్మీనారాయణ. తీరా వెళ్లాక శంకర్‌ని కలిసినప్పటికీ పూర్వానుభవం లేకపోవడంతో ఎవరూ ఆయనకు అవకాశం ఇవ్వలేదు. అలా బొంబాయిలో తన ప్రయత్నాలేవీ ఫలించక పోవడంతో మళ్లీ హైదరాబాద్‌కు తిరుగు పయనం కట్టాడు లక్ష్మీనారాయణ. ఇది జరిగింది 1958 ప్రాంతంలో.
హైదరాబాద్ రాగానే ఆయనకు అట్లూరి పూర్ణచందర్ రావుతో పరిచయం ఏర్పడింది. ఆయన ద్వారా ప్రత్యగాత్మ, ఈయన ద్వారా జి. రామినీడు పరిచయం అయ్యారు. దాంతో లక్ష్మీ నారాయణ సినీ రంగవూపవేశానికి ద్వారాలు తెరచుకున్నాయి.
రామినీడు హైదరాబాద్‌లో తొలిసారిగా చిత్రీకరణ జరుపుకున్న ‘మా ఇంటి మహాలక్ష్మి’ (1959) చిత్రానికి దర్శకత్వం వహిస్తూ సినిమా షూటింగ్ జరిగే విధానాన్ని పరిశీలించమని లక్ష్మీనారాయణకు చెప్పాడు. సినిమాల పట్ల ఆయనలో ఉన్న శ్రద్ధాసక్తులను గమనించిన రామినీడు తాను ఆ తరువాత దర్శకత్వం వహించిన ‘చివరకు మిగిలేది’ (1960) సినిమాకు అసిస్టెంట్‌గా పనిచేయడానికి మద్రాసుకు రమ్మన్నారు.
ఈ చిత్రంలోనే తొలిసారిగా నటించిన డా॥ ప్రభాకర్‌డ్డితో ఏర్పడిన పరిచయం మన వాడి సినీ జీవితాన్ని మలుపు తిప్పింది. ఇద్దరూ తెలంగాణకు చెందిన వారవడంతో మద్రాసులో ఒక గదిలో ఉండేవారు. తరువాత లక్ష్మీనారాయణ రామినీడు వద్దనే ‘కలిమిలేములు’ (1962) హేమాంబరధరరావు వద్ద ‘కలవారి కోడలు’, ‘దేవత’, ‘పొట్టి ప్లీడరు’, ‘వీలునామా’, ‘శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న కథ’, ‘ఆడపడుచు’, ‘కథానాయకుడు’ వంటి చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసి, డైరెక్షన్‌లోని మెళకువలు ఆకళింపు చేసుకున్నాడు.
మెల్లిగా డైరెక్షన్ ఛాన్సులకోసం ప్రయత్నిస్తుండగా మన ప్రభాకర్‌డ్డి ‘బయటి చిత్రాలకు వద్దు. మనమే సొంత బ్యానర్ పెడుతున్నాం. డైరెక్షన్ అవకాశం నేనే ఇస్తాను’ అని మాట ఇచ్చాడు. ఆ తరువాత ఆయన తన మాటను నిలబెట్టుకున్నాడు కూడా. బి.ఎన్.మూవీస్ బ్యానర్‌పై తొలుత కృష్ణ - వాణిశ్రీలతో ‘పచ్చని సంసారం’ (1970) సినిమా తీస్తూ ఆయన్ని దర్శకుడ్ని చేశాడు. అలా లక్ష్మీనారాయణ పేరును కాస్తా లక్ష్మీదీపక్‌గా మార్చేశాడు ప్రభాకర్‌డ్డి.
మొదటి సినిమా ‘పచ్చని సంసారం’ ఆర్థికంగా విజయం సాధించడమేగాక లక్ష్మీదీపక్‌కి దర్శకుడిగా మంచి పేరు వచ్చింది. ఆ వెంటనే ‘కూతురు కోడలు’, ‘జగత్ జంత్రీలు’ (1971) సినిమాలకు దర్శకత్వం వహించారాయన.
లక్ష్మీదీపక్‌ను దర్శకుడిగా అగ్రభాగాన నిలబెట్టిన చిత్రం ‘పండంటి కాపురం’ (1972). ఎస్.వి. రంగారావు, గుమ్మడి, కృష్ణ, ప్రభాకర్‌డ్డి, జమున వంటి అగ్రతారలతో అత్యధిక బడ్జెట్‌తో తీసిన ఈ చిత్రం సాధించిన ఘన విజయం లక్ష్మీదీపక్ స్థాయిని ఎంతో ఎత్తుకు పెంచింది. ఇదే చిత్రాన్ని హిందీలో ఆదుర్తి సుబ్బారావు ‘సునెహరా సంసార్’ పేరుతో నిర్మించగా, తమిళంలో లక్ష్మీదీపక్ దర్శకత్వంలోనే ‘అన్బు సహోదర్ గళ్’ పేరుతో తయారైంది. ‘పండంటి కాపురం’ సినిమా ఆయేటి జాతీయ అవార్డులలో ‘ఉత్తమ ప్రాంతీయ చిత్రం’గా అవార్డు అందుకోవడం లక్ష్మీదీపక్ ప్రతిభకు నిదర్శనం.
ఆ తరువాత లక్ష్మీదీపక్ సినిమాల విజయ పరంపర మొదలైంది. ప్రధానంగా డా॥ ప్రభాకర్‌డ్డితో కలిసి ఆయన రూపొందించిన చిత్రాలు తెలుగు సినిమా రంగంలో ఒక ట్రెండ్‌ని సృష్టించాయి. వీరిరువురి సినిమా జీవితం ఒకేసారి ప్రారంభమైంది. మద్రాసులో ఈయన ఒక సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా, ప్రభాకర్ రెడ్డి ప్రొడ్యూసర్‌గా పేరు పొందారంటే అతిశయోక్తికాదు. ప్రభాకర్‌డ్డి కనిపించిన చోట లక్ష్మీదీపక్‌ను ప్రత్యేకంగా వెదుక్కోనవసరం లేకుండేది. ప్రభాకర్‌డ్డి కథకు దీపక్ కథనం తోడైతే ఒక మంచి చిత్రం రూపొందుతుందనేది సినీ వర్గాల్లో అప్పట్లో ప్రచారంలో ఉన్న విషయం.
ప్రధానంగా లక్ష్మీదీపక్ ఆలోచనలో ఆవేశం నిండి ఉండేది. కథా చర్చల్లో తన వాదనకు అందరి ఆమోదం పొందే వరకు కొనసాగించే నైజం ఆయనది. కథను తెరపై నడపడంలో ఆయనకు మించిన టెక్నీషియన్ లేడు. ప్రభాకర్‌డ్డి తీసిన 27 సినిమాలలో ఎక్కువ చిత్రాలకు దర్శకత్వం వహించింది మన లక్ష్మీదీపకే.
పండంటి కాపురం తరువాత సామాజిక సమస్యలను ఇతివృత్తంగా చేసుకుని ‘గాంధీ పుట్టిన దేశం’ (1973), ‘నాకు స్వాతంత్య్రం వచ్చింది’ (1975) చిత్రాలు తీసిన లక్ష్మీదీపక్ 1979లో ‘కార్తీకదీపం’ చిత్రంతో మరో ఘన విజయం సాధించారు. ఇందులో శ్రీదేవి, శారద, శోభన్‌బాబు ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రంతోనే శోభన్‌బాబు ఇద్దరు హీరోయిన్లతో నటించే ట్రెండ్ మొదలైందనవచ్చు. లక్ష్మీదీపక్ కేవలం నాలుగు పాత్రలతోనే ఈ సినిమాను నడపడం ఆయన గొప్ప ప్రతిభకు నిదర్శనం. వైవిధ్య భరితమైన కథలు ఎంపిక చేసుకోవడమే ఆయన సినిమాల విజయానికి తొలి కారణం.
ఇదే విషయాన్ని ఆయన ఒక సందర్భంలో ప్రస్తావిస్తూ, ‘‘నేను సినిమా నిర్మాణంలో ఏ విషయంలోనూ రాజీ పడకూడదనుకుంటాను. అసలు నిర్మాత ఒక దర్శకుడిని ఎన్నుకున్న తరువాతనే కథ, మిగతా విషయాలపై నిర్ణయాలు జరగాలి. అలా ఆ దర్శకుడి నేతృత్వంలో వాటి ఎంపిక జరిగితేనే ఆ చిత్రం నిర్దిష్టంగా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంటుంది’’ అని అన్నారాయన. అయితే, ఆ తరువాత ‘మహా పురుషుడు’ (1981) సినిమాకు కథ, స్క్రిప్టు సిద్ధమయ్యాక దర్శకుడిగా ఎంపికై సినిమా తీశాక అది బాక్సాఫీసు వద్ద ఫెయిలయ్యింది. అపుడు ‘‘స్క్రిప్టు మార్చకుండా రాజీపడి సినిమా తీయడం తప్పేనని’’ చెప్పుకున్నారాయన.
అలాగే, దర్శకుడు నిర్మాణ రంగంలో, డైరెక్షన్‌లో రెండింటిలో వేలు పెట్టడం సరికాదని, అలా చేయడం వల్ల ఏకాక్షిగత లోపిస్తుందని కూడా అన్నారాయన. అలా అటు నిర్మాతగా, ఇటు దర్శకునిగా ఆయన తీసిన సినిమానే ‘ధైర్యవంతుడు’ (1986) ఇది విజయవంతం కాలేదు.
ఈ నేపథ్యంలో లక్ష్మీదీపక్ ‘గూడు పుఠాణి’ (1972), ‘హారతి’, ‘ఇంటికోడలు’ (1974), ‘వయసొచ్చిన పిల్ల’ (1975), ‘వింత ఇల్లు సంతగోల’, ‘ఈ కాలపు పిల్లలు’ (1976), ‘ఏడడుగుల అనుబంధం’ (1979), ‘ధర్మచక్రం’, ‘సన్నాయి అప్పన్న’ (1980), ‘మహా పురుషుడు’ (1981), ‘తెలుగునాడు’ (1982), చివరి చిత్రం ‘ఇంటింటా దీపావళి’ (1990) వంటి సుమారు 30 చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఆయన తొలి, చివరి చిత్రాల నిర్మాత మన ప్రభాకర్‌డ్డి కావడం గమనార్హం.
జీవితంలో ఊహించిన దాన్ని సాధించిన వాళ్లు చాలా అరుదు. అలాంటి వారిలో ఒకడైన లక్ష్మీదీపక్ తాను దర్శకుడిని కావాలనుకుని స్వయంకృషితో ఆ స్థాయికి ఎదిగి జనరంజక చిత్రాలు తీశారు. మన తెలంగాణ నుండి సినిమా రంగంలోకి వెళ్లి ప్రభాకర్‌డ్డితో కలిసి అనేక ఉదాత్త చిత్రాలు తీసిన లక్ష్మీదీపక్ 2001 జూన్ 10న మృతి చెందారు. వారికి ‘బతుకమ్మ’ పాఠకుల తరఫున ఇవే నీరాజనాలు.