కలం అందరూ పట్టగలరు.
అయితే పట్టినవారందరూ కవులు కాలేదు.
కానీ దానయ్య అయ్యారు.
ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి, పేదరికంలో పెరిగి, కసితో కలం పట్టిన ఆయన కవితలు రాశారు. రెండు వందలకు పైగా సినిమా పాటలు రాశారు. కానీ ఇప్పటికీ తగిన గుర్తింపు కోసం తపన పడుతూనే ఉన్నారు. తన ఒడిదుడుకుల ప్రస్థానం గురించి బండారు దానయ్యకవి చెప్పిన మాటలు... పేరులోనే కవి అని పెట్టుకున్నారెందుకు?నేను రాసిన ‘సిగ్గు-లజ్జ’ కవితా సంకలనానికి మా గురువుగారు వేటూరి ముందు మాట రాశారు. అందులో ఆయన నన్ను ’కవి’ అని సంబోధించారు. అందుకే నా పేరులో కవిని చేర్చుకున్నాను.
మీరు వేటూరి శిష్యులా?
ఏకలవ్య శిష్యుణ్ని. చిన్నప్పట్నుంచీ ఎన్ని పాటలు విన్నా, వేటూరిగారు రాసిన పాటలే నచ్చేవి. ఆయన సాహిత్యం పట్ల విపరీతంగా పెరిగిన ఇష్టమే నేను పాటల రచయితను కావడానికి కారణం.
మీ బ్యాగ్రౌండ్ ఏమిటి? కలమెప్పుడు పట్టారు?మాది నల్లగొండ జిల్లా. మా అమ్మగారిది ఎల్లారెడ్డిగూడెం, నాన్నగారిది కీతవారి గూడెం. పెరిగిందంతా అమ్మ వాళ్ల ఊరిలోనే. బాగా అల్లరి చేసేవాణ్ని. నా ఆలోచనలు రాసి కవితలంటూ స్కూల్లో ఫ్రెండ్స్‌కి ఇచ్చేవాడిని. టీచర్లు తిట్టేవారు. కానీ మా తెలుగు మాస్టారు ఆచార్య నరసింహాచారి నన్ను ప్రోత్సహించి, వ్యాస రచన పోటీలకు పంపించేవారు. జిల్లా స్థాయిలో ప్రైజులు కూడా గెలుచు కున్నాను. పాటలు రాసి స్టేజీల మీద పాడే వాడిని. ఇంటర్ అయ్యాక నేను రాసిన ‘గృహ హత్యలు’ నాటకం రేడియోలో కూడా ప్రసారమయ్యింది.
సినిమాలకు రాయాలని ఎందుకనుకున్నారు?మా నాన్న కూలిపని చేసేవారు. వచ్చిన కాస్తంత డబ్బుతోనే మమ్మల్ని పోషించే వారు. కానీ బంధువులు, స్నేహితులు మా పేదరికాన్ని అవహేళన చేసేవారు. పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు వెళ్లినా అమ్మానాన్నలు ఓ మూల నిలబడటం నన్ను చాలా బాధించేది. ఆ బాధలోంచే డబ్బు సంపాదించాలన్న కసి పుట్టింది. ఏదో ఒకరోజు నా ఇంటికి ఇన్ కమ్‌ట్యాక్స్ వాళ్లు, మీడియా రావాలి, ఆ స్థాయికి నేనెదగాలి అనుకున్నాను. దానికి సినిమాలు మంచి మార్గమని తోచడంతో డిగ్రీ అవ్వగానే హైదరాబాద్ వచ్చేశాను.
అవకాశం త్వరగానే వచ్చిందా?లేదు. రెండేళ్లు పిచ్చిగా తిరిగాను. ఫలితం లేకపోవడంతో ఎమ్మే చేస్తూ ప్రయత్నాలు సాగించాను. ఓసారి రామానాయుడు స్టూడియోకి వెళ్తే, ఓ చెట్టుకింద కారులో వేటూరి కూర్చుని ఉన్నారు. పట్టలేని ఉద్వేగంతో వెళ్లి, ఆయన స్ఫూర్తితోనే రచయితను కావాలనుకుంట న్నానని చెప్పాను. తనను కలవడం వల్ల ఉపయోగం లేదని, ఓ దర్శకుడి దగ్గరకు పంపారు. అక్కడ అవకాశం దొరకలేదు కానీ, నా గురువు, దైవం వేటూరి ఇచ్చిన ప్రోత్సాహం నాలో ధైర్యాన్ని నింపింది.
మరి తొలిపాట ఎప్పుడు రాశారు?ఓసారి ఒక ఆఫీసుకు వెళ్తే అక్కడ వెలి గొండ శ్రీనివాస్ ఉన్నారు. నా పాట విని వెంటనే ఒక నిర్మాతకు ఫోన్ చేసి చెప్పారు. దాంతో ‘నువ్వుంటే చాలు’కి రాసే చాన్‌స వచ్చింది. తర్వాత ‘వియ్యాలవారి కయ్యాలు’కి రాశాను. అప్పడో విచిత్రం జరిగింది. ‘సూర్యుడే సరే అన్నాడే’ పాటకు రెండు వెర్షన్స్ రాసిచ్చాను. నా పాట సెలెక్ట య్యింది. కానీ ఆ పాట పల్లవి మాత్రమే నాది, చరణాలు వేటూరి గారివి. ఆయన కూడా పాట రాశారట. కానీ నా పల్లవి బాగుందని అదే ఉంచమన్నారట. ‘పాటకు తన పేరే వేయండి, పల్లవే కదా పాటకు మకుటం’ అన్నారట. అంత గొప్పవారు! నాకైతే ఆనందంతో కన్నీళ్లు వచ్చేశాయి.
ఇంతవరకూ ఎన్ని పాటలు రాశారు?రెండు వందలకు పైనే రాశాను. ఎవడిగోల వాడిదే, మహానంది, విక్రమార్కుడు, దొంగోడు, వీర, ఢమరుకం... ఇలా. ప్రస్తుతం కెవ్వు-కేక, దేవదాసు స్టైల్ మార్చాడు, ఇంద్రగంటి మోహనకృష్ణ సినిమాలకు పని చేస్తున్నాను.
మీకు తగిన గుర్తింపు వచ్చిందంటారా?లేదనే చెప్పాలి. అవకాశాలు బాగున్నా గుర్తింపు అంతగా రాలేదు. మెల్లగా వస్తుందేమో మరి. బస్సు లోనో, రైల్లోనో ప్రయాణించేవారు త్వరగా గమ్యం చేరు కుంటారు. కాలినడకన వెళ్లేవారు కాస్త ఆలస్యంగా చేరుకుంటారు. నేను కాలి నడకన వెళ్తున్నాను. కాని ఆలస్యమైనా గమ్యం చేరుకునే తీరతాను.
మీ తెలుగుతల్లి ఫౌండేషన్ గురించి చెప్పండి?తెలుగు భాషను కాపాడాలి, తెలుగువారి మధ్య సయోధ్యను కుదర్చాలి అన్న ఉద్దే శంతో ఈ ఫౌండేషన్‌ను స్థాపించాను. దీని ద్వారా సేవా కార్యక్రమాల్ని కూడా చేస్తు న్నాను. నెలకు రెండుసార్లు అనాథాశ్ర మాలకు వెళ్లి ఆహారం, దుస్తులు ఇస్తుం టాను. మా జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యను పోగొట్టడానికి కూడా ప్రయత్నిస్తున్నాను.
భవిష్యత్ ప్రణాళికలు?నా ఫౌండేషన్ సేవల్ని విస్తరించాలి. గొప్ప పాటలు రాయాలి. ప్రస్తుతం బతకాలి కాబట్టి రాస్తున్నాను కానీ తృప్తి లేదు. మంచి కాలం వస్తుంది. తెలుగు సినిమాలో సాహిత్యపు విలువ పెరుగుతుంది. ఆ రోజుకోసం ఎదురు చూస్తున్నాను.