పల్లవి:
ఓ.. ఓ.. ఓ.. ఓ...
సూరీడుపువ్వా జాబిల్లి గువ్వా చినబోయినావెందుకే
మాకంటి చలువ కోనేటి కలువ కన్నీటి కొలువెందుకే
నడిరేయి జాములో తడి లేని సీమలో...
సూరీడుపువ్వా జాబిల్లి గువ్వా చినబోయినావెందుకే
మాకంటి చలువ కోనేటి కలువ కన్నీటి కొలువెందుకే
చరణం 1:
బతుకే బరువు ఈ నేలకి.. కరుణే కరువు ఈ నీటికి
వెలుగే రాదు ఈ వైపుకి.. శ్వాసే చేదు ఈ గాలికి
ఆకాశమే మిగిలున్నది ఏకాకి పయనానికి
ఆ శూన్యమే తోడున్నది నీ చిన్ని ప్రాణానికి
నిదురించునే నీ తూరుపు నిట్టూర్పే ఓదార్పు
అందాల చిలక అపరంజి మొలక అల్లాడకే అంతగా
పన్నీటి చినుకా కన్నీటి మునకా కలలన్ని కరిగించగా
చరణం 2:
ఏవైపునందో ఏమో మరి జాడే లేదే దారి దరి
ఏమవుతుందో నీ ఊపిరి వేటాదిందే కాలం మరి
నీ గుండెల్లో గోదావరి నేర్పాలి ఎదురీతని
నీకళ్ళలో దీపావళి ఆపాలి ఎద కోతని
పరుగాపని పాదలతో కొనసాగని నీ యాత్రని
శ్రీ వేంకటేశా ఓ శ్రీనివాసా ఈ మౌనం ఎన్నాళ్ళయా
అల వైకుంఠాన అంతఃపురాన ఏ మూల వున్నావయ్య
ఓ నామాల దేవరా ఈ నీ మాయ ఆపరా
శ్రీ వేంకటేశా ఓ శ్రీనివాసా ఈ మౌనం ఎన్నాళ్ళయా
అల వైకుంఠాన అంతఃపురాన ఏ మూల వున్నావయ్య
చిత్రం : అంతః పురం (1999)
సంగీతం : ఇళయరాజా
రచన : సిరివెన్నెల
గానం: ఎస్.జానకి