పల్లవి:
మనసా మన్నించమ్మా మార్గం మళ్ళించమ్మా
నీతో రాని నిన్నల్లోనే శిలవై ఉంటావా
స్వప్నం చెదిరిందమ్మా సత్యం ఎదరుందమ్మా
పొద్దేలేని నిద్దర్లోనే నిత్యం ఉంటావా
ప్రేమా ప్రేమా నీ పరిచయం పాపం అంటే కాదనలేవా
ప్రేమా ప్రేమా నీ పరిచయం పాపం అంటే కాదనలేవా
చరణం:
దేవాలయంలా ఉంటే నీ తలపు ప్రేమ దైవంలా కొలువుంటుందమ్మా
దావానలంలా తరిమే నిట్టూర్పు ప్రేమని నీనుంచి వెలివేస్తుందమ్మా
అంత దూరం ఉంటేనే చందురుడు చల్లని వెలుగమ్మా
చెంతకొస్తే మంటేనే అందడని నీతో చెప్పమ్మా
మన క్షేమం కోరుకునే జాబిలే చెలిమికి చిరునామా
తన సౌఖ్యం ముఖ్యమనే కాంక్షలో కలవరపడకమ్మా
ప్రేమా ప్రేమా నీ స్నేహమే తీరని శాపం మన్నిస్తావా
చరణం:
ఒక చినుకునైనా దాచదు తనకోసం నేలకు నీరిచ్చి మురిసే ఆకాశం
నదులన్నితానే తాగే ఆరాటం కడలికి తీర్చేనా దాహం ఏమాత్రం
పంజరంలో బంధించి ఆపకే నేస్తాన్నేనాడు
పల్లకివై పంపించి చల్లగా దీవించవె నేడు
ఙాపకంలో తీయదనం చేదుగా మార్చవ కన్నీళ్ళు
జీవితంలో నీ పయనం ఇక్కడే ఆపదు నూరేళ్ళు
ప్రేమా ప్రేమా మదిలో భారం కరిగించేలా ఓదార్చవా
చిత్రం : ఆడవారి మాటలకు అర్థాలే వేరులే(2007)
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
సంగీతం : యువన్‌శంకర్‌రాజా
గానం : కార్తీక్