1. లేతమనసులు (1966)
ఇద్దరు చిన్నారులు. అమ్మ దగ్గర ఒకరు. నాన్న దగ్గర ఇంకొకరు. వీళ్లద్దరూ కలిసి అమ్మానాన్నలను కలపాలి. మళ్లీ మళ్లీ విడిపోకుండా బ్రహ్మముడి వేయాలి. వేశారు కూడా. చూస్తుంటే కళ్లతో పాటు మనసు, మనసుతో పాటు ఆసాంతం మమేకం అయిపోతాం.
2. భక్త ప్రహ్లాద (1967)
అమ్మతనాన్ని తలపించే పోతన పద్యాల కమ్మదనం. తేనెలూరే సాలూరివారి స్వరాలు. ప్రహ్లాదునిగా రోజారమణి నటవిన్యాసం. మహానటుడు ఎస్వీఆర్ నటనావైదుష్యం. భాగవత గాథకు చిత్రపు నారాయణమూర్తి చేసిన అందమైన చిత్రికలు.
3. బాలరాజు కథ (1970)
అన్నాచెల్లెళ్ల అనురాగానికి నిలువెత్తు అద్దం. పసిహృదయాల అంతర్మథనం. మహాబలిపురం అందాలు. అసలు సిసలైన బాపుబొమ్మ.
4. మరోప్రపంచం (1970)
మరోప్రపంచాన్ని సృష్టించే సత్తా భావిభారతపౌరులైన పిల్లలకే ఉందని చెప్పిన కథ. కుల, మత, వర్గ, వర్ణ భేదాలకు అతీతంగా.. సమసమాజ స్థాపన కోసం పిల్లలనే ఆయుధాలుగా చేసుకున్న పెద్దల కథ.
5. పాపం పసివాడు(1972)
ఎండకన్నెరగని పసిబాలుడు ఎడారిలో ఇరుక్కుంటే? క్షణక్షణం భయం భయం. తెరపై పసివాడికీ... చూసే మనకు కూడా. గుండెల్ని పిండేసే విషాదం. సుఖాంతమయ్యే దాకా సీటు నుంచి కదలబుద్ది కాదు.
6. బాలభారతం (1972)
బాలభీముడు నాగాయుధ బలసంపన్నుడవడం. బొందితో స్వర్గానికి వెళ్లడం. కౌరవుల మట్టి ఏనుగుకు ప్రతిగా స్వర్గలోకం నుంచి ఐరావతాన్ని దించడం... ఎలా ఎన్నో ఆసక్తికర అంశాల సమ్మేళనం. కమలాకర కామేశ్వరరావు అపూర్వసృష్టి.
7. బాలమిత్రుల కథ (1972)
కులమత భేదాలకు అతీతమైనది స్నేహం అని చెప్పిన సినిమా. ‘గున్నమామిడి కొమ్మమీద’ పాట ఆల్‌టైమ్ హిట్.
8. భక్త ధృవమార్కండేయ (1982)
అధికభాగం చిన్నపిల్లలతో చేసిన తొలిప్రయోగం. ఓవైపు హరిభక్తుడైన ధృవుడు, మరోవైపు హరభక్తుడైన మార్కండేయుడు. రెండు కథలకు ఒకేసారి తెరరూపం. భానుమతి దర్శకత్వ ప్రతిభ.
9. రేపటి పౌరులు (1986)
గద్దల్లాంటి పెద్దలకి తగుబుద్దులు చెప్పిన బాలసైనికుల కథ. టి.కృష్ణ మార్కు విప్లవాత్మక మాయాజాలం. ఇక విజయశాంతి నటన సరేసరి.
10. రామాయణం (1996)
చిన్నిరాముడు, చిన్నారి సీతల కల్యాణ వైభోగం చూడటానికి రెండు కళ్లు చాలవు. రామునిగా జూనియర్ ఎన్టీఆర్ తెరంగేట్రం. గుణశేఖర్ మార్కు మేజిక్.
(ూఅభిరుచిని బట్టి ఈ టాప్ 10 మారుతుంటుంది)